ఆరోగ్య వ్రతము - శ్రీ సూర్యారాధన
అగస్త్యు డిట్లు చెప్పెను: మిక్కిలి పుణ్యమైనది, పాపములన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియజేసెదను. మాఘమాసము శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కరదేవుని పూజింపవలయును.
ఆదిత్య భాస్కర రవే భానో సూర్య దివాకర,
ప్రభాకరేతి సంపూజ్య ఏవం సంపూజ్యతే రవిః. 3
ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింపవలయును. షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమినాడు భానుని పూజింప వలయును. అష్టమినాడు మరల భొజనము చేయవలయును. ఇది యిందలి విధిక్రమము. ఈ విధితో ఒకనిండు సంవత్సరము సూర్యునర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగును.
మునుపు అసరణ్యుడను గొప్పబలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతనియెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమమగు ఆరోగ్యమును ప్రాసాదించెను.
ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది రెండవ అధ్యాయము.

No comments:
Post a Comment